వానాకాలం సీజన్‌లో నకిలీ విత్తనాల విక్రయాలు పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. నకిలీ దందాపై కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించగా.... రాష్ట్రవ్యాప్తంగా అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్‌లో హయత్‌నగర్‌లోని రైతు మార్కెట్‌లో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.50 లక్షల విలువ చేసే సుమారు 3 టన్నుల విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని రాచకొంచ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
పది రోజుల క్రితమే నగర శివారులోని నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి వివిధ రకాల బ్రాండ్ల కవర్లలో వాటిని నింపి తరలిస్తున్న నలుగురు కేటుగాళ్ళను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.50లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
బతుకుదెరువు కోసం వచ్చి..
కర్నూలు జిల్లాకు చెందిన చింతల వెంకటేశ్వర్లు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి విత్తన వ్యాపారం చేసే నంద్యాలకు చెందిన కృష్ణనాయక్, వెంకటరమణలు పరిచయమయ్యారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు వారితో కలిసి నకిలీ విత్తనాల దందాకు తెరలేపాడు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న రైతులకు మార్కెట్‌లో చెలామణిలో ఉన్న విత్తన బ్రాండులు బిల్లా, పావని కంపెనీల లేబుళ్లలో నకిలీ విత్తనాలను నింపి అమ్మడం మొదలు పెట్టాడు. ఇందుకోసం నగర శివారులోని బ్రాహ్మణపల్లిలో ఒక గోదాంను అద్దెకు తీసుకుని అందులో నకిలీ విత్తనాలు తీసుకు వచ్చి వాటికి రంగులు కలిపి బ్రాండ్ల విత్తనాల మాదిరిగా తయారు చేస్తున్నారు.
వలపన్ని పట్టుకున్నారు...
అశోక్ అనే మరో వ్యక్తి ఈ విత్తనాలను కలిపి కవర్లలో ప్యాకింగ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఒక డీసీఎం వాహనంలో వీటిని తరలిస్తుండగా సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులిచ్చిన సమాచారంతో ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు, వ్యవసాయశాఖాధికారులు వలపన్ని హయత్ నగర్ వద్ద పట్టుకున్నారు. విత్తనాలు తయారు చేసే మిషన్‌తోపాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. వీరి నుంచి 2.8టన్నుల నకిలీ విత్తనాలు, బ్రాండ్ల కవర్లు తయారీ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే పలువురు రైతులకు విత్తనాలు విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 450గ్రాముల పాకెట్లను రూ.730 విక్రయించాలని నిర్ధేశించారు. అయితే అదే బ్రాండ్ రూ.500కే విక్రయిస్తూ రైతులను బురిడీ కొట్టిస్తున్నారు.
మోసపోవద్దు..
నకిలీ విత్తనాలు అమ్ముతూ ఒక కేసులో పట్టుబడినా పీడీ యాక్టు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైతులు కూడా తక్కువ ధరకు వస్తున్నాయని బ్రాండ్ల పేరుతో అమ్మె విత్తనాలను కొనుగోలు చేయరాదని... ఏ మాత్రం అనుమానం ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వాలని హెచ్చరిస్తున్నారు.
ఇవీ చూడండి: రెండు నెలల్లో 36 లక్షల మంది ఈపీఎఫ్ ఉపసంహరణ