ఆదిలాబాద్ జిల్లాలో మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అక్రమాలపై ఈటీవీ- ఈటీవీ భారత్‌లో వస్తున్న వరుస కథనాలతో అధికారులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశాలమేరకు... ఇచ్చోడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ పరిశోధనాధికారిగా ప్రారంభమైన విచారణలో... విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. మండలాల వారీగా... నేరడిగొండలో 30, బోథ్‌లో 30, బజార్‌హత్నూర్‌లో 30, గుడిహత్నూర్ మండలంలో 15, మావల మండలంలో ముగ్గురు బినామీ వ్యక్తుల పేరిట పెళ్లి సాయం డబ్బులు మంజూరైనట్లు వెల్లడైంది. మొత్తం 113 మంది బినామీల పేరిట.. ఒక్కొక్కరికి లక్షా 116 చొప్పున కల్యాణలక్ష్మి చెక్కులు జారీ అయినట్లు తేలింది. ఇందులో ఇప్పటికే కొంతమంది బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకోగా... మరికొందరి చెక్కులు తహసీల్దారు కార్యాలయాల్లో ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. నిందితులుగా తేలిన వ్యక్తుల నుంచి డబ్బులు రికవరీ చేయాలని అధికారులు చెబుతున్నారు.
అక్రమాలపై జరుగుతున్న విచారణలో నేరుగా తహసీల్దార్ల పాత్ర లేదనే విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తహసీల్దార్లు జరిపిన లావాదేవీలపై పోలీసులు ఆరా తీశారు. మరోవైపు లబ్ధిపొందినట్లుగా భావిస్తున్న బినామీ వ్యక్తుల... బ్యాంకు ఖాతాల లావాదేవీలను... తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ వ్యవహారంలో ఇప్పటికే సస్పెండ్ అయిన నదీం అనే అధికారి పరారీలో ఉండడంతో... అధికారులు గాలిస్తున్నారు. అతడు పట్టుబడితే మరిన్ని వివరాలు బయటకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.