చేపల చెరువుల అభివృద్ధి కోసమని రుణాలు తీసుకొని ఇతర వ్యాపారాలకు మళ్లించి ఆంధ్రాబ్యాంకును మోసం చేశారన్న అభియోగంపై వీనస్ ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ డైరెక్టర్ల ఆస్తులను ఈడీ తాత్కాలిక జప్తు చేసింది. వీనస్ ఆక్వా ఫుడ్స్ ఎండీ నిమ్మగడ్డ రామకృష్ణ, డైరెక్టర్లు నిమ్మగడ్డ వేణుగోపాల్, వీవీఎన్ కే విశ్వనాథ్, వారి కుటుంబ సభ్యులకు చెందిన సుమారు రూ.11 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది.
హైదరాబాద్, విజయవాడ పరిసరాల్లో ఉన్న ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువ దాదాపు 33 కోట్ల 39 లక్షల రూపాయలు ఉంటుందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. చేపల చెరువుల అభివృద్ధి పేరిట ఆంధ్రప్రదేశ్లో గుడివాడలోని ఆంధ్రాబ్యాంకు నుంచి వీనస్ ఆక్వా ఫుడ్స్ 19 కోట్ల 44 లక్షల రుణం తీసుకొని... తిరిగి చెల్లించలేదని ఈడీ తెలిపింది. రుణం కోసం 470 ఎకరాల చెరువును లీజుకు తీసుకున్నట్లు తప్పుడు డాక్యుమెంట్లను సమర్పించినట్లు పేర్కొంది. ఆ రుణాన్ని వీఏఎఫ్ఎల్ అనే సంస్థకు మళ్లించి దాని పేరుపై మళ్లీ రుణం తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. 'ఆకాశమే హద్దు' అనే సినిమా నిర్మాణం కోసం రూ.కోటీ 72 లక్షలు మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది.
చేపల చెరువు అభివృద్ధిలో నష్టం వచ్చిందంటూ రుణం చెల్లించకపోవడం వల్ల ప్రస్తుతం యూనియన్ బ్యాంకుగా ఉన్న అప్పటి ఆంధ్రాబ్యాంకుకు 36 కోట్ల 97 లక్షల నష్టం వాటిల్లినట్లు గతంలో బెంగళూరు సీబీఐ విభాగం కేసు నమోదు చేసింది. సీబీఐ అభియోగపత్రం ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు చేసిన ఈడీ.. రుణం సొమ్ముతో ఆస్తులు కూడబెట్టుకున్నట్లు గుర్తించింది. యాభై నాలుగు మంది పేరిట మరో 22 కోట్ల 64 లక్షల రుణం కూడా తీసుకున్నట్లు దర్యాప్తులో ఈడీ గుర్తించింది.