హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరాదారులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు వరుసగా అరెస్ట్ చేయడం, పోలీసుల శాఖ ఆకస్మిక తనిఖీలతో మాదకద్రవ్యాల సరఫరాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. బెంగళూరు కేంద్రంగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో డ్రగ్స్ వాడకందార్లతో విస్తృతంగా సంబంధాలు కలిగిన ఇబుకా సుజును, అతని ప్రియురాలిని అరెస్ట్ చేయడం వల్ల మాదకద్రవ్యాల సరఫరా ముఠాలు అప్రమత్తమయ్యాయి. డ్రగ్స్ సరఫరా ముఠాలు హైదరాబాద్ రావడానికి భయపడుతున్నాయి.
వెలుగులోకి కొత్త అంశాలు
జూన్‌లో పదిమందికిపైగా సరఫరాదారులను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ వాడకందార్లకు కౌన్సిలింగ్ ఇస్తున్న తరుణంలో కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు మాదకద్రవ్యాల సరఫరా తాత్కాలికంగా ఆగినట్లు అధికారులు అంచనావేస్తున్నారు.
నగరానికి రాలేము
బెంగళూరు, ముంబయి నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న రెండు ముఠాలను అబ్కారీ శాఖ అధికారులు గుర్తించారు. ఆ ముఠాలకు వాడకందార్ల ద్వారా ఫోన్ చేయించి నగరానికి రప్పించి పట్టుకోవడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఫోన్ కాల్స్‌కు స్పందిస్తున్న ముఠాలు... ఇప్పట్లో తాము హైదరాబాద్ రాలేమని చెబుతున్నారని అబ్కారీశాఖ వర్గాలు వెల్లడించాయి. బెంగళూరు, ముంబయి వచ్చి డ్రగ్స్ తీసుకోవాలని చెబుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే... మాదకద్రవ్యాల ముఠాలు హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పెరిగిన నిఘా
హైదరాబాద్‌లో నైజీరియన్లు ఉండే ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరు అధికారికంగా ఉంటున్నారు... ఎవరెవరు వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్నారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డైరెక్ట్‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్-డీఆర్‌ఐ విభాగాలు కూడా డ్రగ్స్ ముఠాలపై నిఘా పెట్టాయి. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌కు రావడం శ్రేయస్కరం కాదని భావిస్తున్న డ్రగ్స్ ముఠాలు... సరఫరాను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు తెలుస్తోంది.
మాదకద్రవ్యాల కోసం వాడకందార్లు ముంబయి, బెంగళూరు వెళ్లి తెచ్చుకునే పరిస్థితి లేకపోవడం వల్ల కొన్ని రోజులు సరఫరా ఆగిపోతుందని అంచనా వేస్తున్నారు. కొత్త ముఠాలు రంగ ప్రవేశం చేసే అవకాశం లేకపోలేదని భావిస్తున్న నిఘా విభాగాలు మరింత అప్రమత్తమయ్యాయి.
ఇదీ చూడండి: రమణీయంగా మారిన తెలంగాణ నయాగరా