నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టి పాలెం వద్ద అద్దంకి నార్కట్పల్లి రహదారి పక్కనే ఉన్న ఎస్ఆర్ పెట్రోల్ బంకు వెనకాల ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మిర్యాలగూడలోని రవీంద్ర నగర్ కాలనీకి చెందిన వెంకట్ రెడ్డి గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నెల 13న ఇంటి నుంచి వెళ్లిన అతను బంకు వెనకాల పొలాల్లో శవమై తేలాడు. పెట్రోల్ పోసుకొని చనిపోయిన ఆనవాళ్లు ఉన్నాయి.
నిర్మానుష్య ప్రదేశం కావడం వల్ల చనిపోయి వారం రోజులైనప్పటికీ ఎవరు గుర్తించలేదు. శవం గుర్తు పట్టలేని విధంగా కాలిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సెల్ ఫోన్, ఏటీఎం కార్డు ఆధారంగా బంధువులకు సమాచారం ఇచ్చారు.
గతంలో కూడా ఇంటి నుంచి వెళ్లి తిరిగి వచ్చాడని.. ఇప్పుడు కూడా అలాగే వస్తాడని అనుకున్నామని బంధువులు తెలిపారు. ఇలా జరుగుతుందని ఊహించలేదని అన్నారు. మృతునికి భార్య లక్ష్మి , ఒక పాప ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.