మూడు కమిషనరేట్ల పరిధితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేస్టినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. ఇతని నుంచి 52లక్షల విలువైన 1040గ్రాముల బంగారం, 40వేల నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని సజ్జనార్ తెలిపారు. నిందితుడు మీర్ ఖాసీం అలీ ఖాన్ పగలు రెక్కీ చేసి తాళం వేసి ఉన్న ఇళ్లు కనిపిస్తే దొంగతనాలు చేస్తాడని పేర్కొన్నారు. బంగారం తప్ప వెండి చోరీ చేయకపోవడం ఇతని నైజమన్నారు.
టోలీచౌకికి చెందిన మీర్ ఖాసీం అలీ ఖాన్ చెడు అలవాట్లకు బానిసగా మారి 2008 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నాడని సీపీ వివరించారు. ఇతను 70కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. ప్యాంటు జేబులో దొంగతనానికి కావాల్సిన సామాగ్రిని పెట్టుకుని ఎలక్ట్రిషియన్ అని చెప్పుకుంటాడని సీపీ తెలిపారు. ఇతనిపై 3సార్లు పీడీ యాక్ట్ నమోదైందని సజ్జనార్ స్పష్టం చేశారు. ఎస్‌వోటీ శంషాబాద్, నార్సింగి పోలీసులు సంయుక్తంగా వలపన్ని నిందితుడు మీర్ ఖాసీం అలీ ఖాన్ను పట్టుకున్నారని సీపీ తెలిపారు.
ఇదీ చూడండి: దుకాణాల్లో చోరీ చేసి ఒఎల్ఎక్స్లో అమ్ముతున్నారు: సజ్జనార్