ఆన్లైన్లో నగదు మోసాలు... డెబిట్ కార్డ్ అప్డేట్ పేరుతో బ్యాంక్‌లో సొమ్ము కొట్టేయడాలు.. గిఫ్ట్ పేరుతో కుచ్చుటోపీ... ఇంతవరకు ఇటువంటి తరహా సైబర్నేరాలను చూసాం. కానీ చెక్కును జారీచేయక ముందే సొమ్మును కాజేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది.
రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న షాదీ ముబారక్ పథకం ద్వారా అందిన చెక్కులో సొమ్మును గుర్తు తెలియని వ్యక్తులు కాజేశారు. సొమ్ము చేతికందకముందే తమిళనాడులోని ఎస్బీఐ బ్యాంకులో నగదు తీసుకున్నారు. ఘటనపై బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇదీ జరిగింది
చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన బాధితుడు ఈ ఏడాది జనవరిలో తన కూతురు వివాహం చేశాడు. షాదీ ముబారక్ పథకానికి దరఖాస్తు చేసుకోగా ఫిబ్రవరి 8న చెక్కు మంజూరయ్యింది. ఫిబ్రవరి 22న బండ్లగూడ రెవెన్యూ అధికారులు, లబ్ధిదారుడికి ఇచ్చారు. దానిని అతడు బ్యాంకులో డిపాజిట్ చేశాడు. కానీ అది క్యాష్ కాలేదు. బాధితుడు బ్యాంకు అధికారుల వద్ద ఆరాతీయగా... ఆ చెక్కు ఫిబ్రవరి 10న చెన్నైలోని ఎస్బీఐ బ్రాంచ్‌లో ఎన్‌క్యాష్ అయ్యిందని తెలిపారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: ఉద్యోగం రాలేదని రైలుకింద పడి యువకుడు ఆత్మహత్య