ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని లక్షల రూపాయలను దోచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. లేనిది ఉన్నట్టు భ్రమ కల్పించి డబ్బు ఎరవేసి మాయ చేస్తున్నారు. ఈ విధంగా మోసపోయి పోలీసు స్టేషన్లకు చేరుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన ఓ మహిళ ఇదే తరహాలో మోసపోయింది.
కొన్నిరోజుల క్రితం బాధితురాలికి ఓ ఉత్తరం వచ్చింది. దానిలో ప్రముఖ సంస్థకు చెందిన గిఫ్ట్ కార్డు ఉంది. రూ.12 లక్షలు గెలుచుకున్నట్టు రాసి ఉంది. నిజమని నమ్మిన సదరు మహిళ.. దానిపై ఇచ్చిన చరవాణి నంబరుకు ఫోన్ చేసింది. 'మీరు నగదు బహుమతి గెలుచుకున్నారు. ఈ డబ్బులు మీకు రావాలంటే పన్నుల రూపంలో కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంద'ని తెలిపారు. దీనికి అంగీకరించిన బాధితురాలు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పలు దఫాలుగా రూ.2,22,600 చెల్లించింది. అయినా ఇంకా చెల్లించాలని అవతలి వారు అడుగుతుండటంతో మోసపోయానని గ్రహించి కంకిపాడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు సైబర్ పోలీసుస్టేషన్‌కు బదిలీ అయ్యింది.
బ్యాంకు ఖాతాలు గుర్తింపు
బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు... నగదు జమ అయిన బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. ఇవి పశ్చిమ బంగా, దిల్లీ, గుజరాత్‌లలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సైబర్ పోలీసులు.. బ్యాంకు అధికారులతో మాట్లాడి నేరస్తులు వాడిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఆ ఖాతాల్లో ఉన్న రూ.2,34,356లను ఎలాంటి లావాదేవీలు జరగకుండా నిలుపదల చేశారు.
ఇదీ చదవండి : మరో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు రావొచ్చు : చంద్రబాబు