తమ స్నేహానికి గుర్తుగా బహుమతులు పంపిస్తున్నానని చెప్పి లక్షలు దోచేశాడు ఓ సైబర్ నేరగాడు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎన్బీటీనగర్కు చెందిన ఓ మహిళకు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను నెదర్లాండ్స్‌లో ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు నమ్మించాడు. ఫోన్ నంబర్ సైతం తీసుకుని కొన్నాళ్లు వాట్సాప్ ద్వారా చాటింగ్ చేశాడు.
ఆపై తమ స్నేహానికి గుర్తుగా కొన్ని విలువైన బహుమతులు పంపుతున్నానని చెప్పాడు. కొన్ని వస్తువుల ఫొటోలను వాట్సాప్ చేసిన సదరు వ్యక్తి... కొరియర్ చేస్తున్నానని తెలిపాడు. ఆ తర్వాత రెండు రోజులకు దిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారుల పేరుతో మహిళకు ఫోన్ వచ్చింది. నెదర్లాండ్స్ నుంచి తన పేరుతో వచ్చిన పార్శిల్లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయని... అవి క్లియర్ చేయడానికి కొన్ని పన్నులు చెల్లించాలని చెప్పారు.
ఇలా దఫదఫాలుగా రూ. 6 లక్షల 85 వేలను తమ ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నారు. ఇంకా డిమాండ్ చేస్తుండటం వల్ల అనుమానం వచ్చిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.