కుమురం భీం అసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో భారీఎత్తున టపాసులను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యాపారి ఇంట్లో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేశారన్న సమాచారంతో జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ, రామగుండం సీపీ సత్యనారాయణ ఆదేశాలతో పోలీసులు దాడులు చేశారు.
ఈ సోదాల్లో దాదాపు మూడు లక్షల విలువైన టపాసులను సీజ్ చేసి, రాచకొండ ప్రదీప్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. కరోనా దృష్ట్యా టపాసుల వ్యాపార నిర్వహణకు జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా అనుమతులు నిరాకరించారు. అయినప్పటికీ కొందరు అక్రమంగా విక్రయాలు చేపడుతున్నారు. అక్రమంగా ఎవరైనా వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ సత్యనారాయణ హెచ్చరించారు.