భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురానికి చెందిన దంపతులు ఆత్మహత్యాయత్నం చేయగా.. భర్త మృతి చెందాడు. తమ చావుకు ఎవరూ బాధ్యులు కాదని అనారోగ్య కారణాల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. వినాయకపురానికి చెందిన నల్లమోతుల నాగమల్లేశ్వరరావు(60) క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఇప్పటికే అతను వైద్యం కోసం సుమారు రూ.8 లక్షలు ఖర్చు చేశారు. అతని భార్య నాగరత్నం కూడా అనారోగ్యంతో బాధపడుతోంది.
వీరిద్దరూ తమ కుమారుడికి భారం కాకూడదని లేఖ రాసి, చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. లేఖ ఆధారంగా కుటుంబసభ్యులు గాలించారు. అప్పటికే భర్త మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న భార్యను కాపాడారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.