కరోనాతో చనిపోవాలని ఎవ్వరూ అనుకోరు. ఆ మాటకొస్తే... ఏ వ్యాధితోనూ చనిపోవాలని ఎవరూ కోరుకోరు. అందుకే చివరి దశలో... ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా త్వరగా తీసుకుపోయేలా చూడంటూ చాలా మంది ఆ భగవంతుడిని కోరుకుంటారు. అయితే తలచినదే జరిగితే ఇక దైవం ఎందుకన్నట్టు... జీవితంలో అనుకోనిదే జరుగుతుంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంతగా వణికిస్తుందని ఎవరూ ఊహించలేదు. దేశ దేశాలు దాటి... మనం ఉన్న చోటుకే వస్తుందని నాలుగైదు నెలల క్రితం వరకు కలగనలేదు.
ఇప్పుడు రోజు రోజుకీ వైరస్ విజృంభిస్తోంది. ఆసుపత్రులు, ఇళ్లలోనూ కొవిడ్ బాధితులే. అయితే చాలామంది కోలుకొని, తిరిగి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనడం శుభపరిణామమే. ఇదే సమయంలో కొంతమంది చనిపోవడమూ బాధాకరమే. కరోనా వైరస్ సోకిందంటే... భయపడాల్సిన అవసరం లేదని ఎంతోమంది చెబుతున్నా... ఇంకా అనేక మంది ఆందోళన చెందుతున్నారు. ఆ భయమే మనషుల మనసులను... రాయి చేస్తోంది. కసాయిలుగా మార్చేస్తోంది. తోటి మనిషి అంత్యక్రియలనూ అడ్డుకునేలా మార్చేసింది.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఓ వ్యక్తి కరోనాతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. అయితే పరిస్ధితి విషమించి బుధవారం రాత్రి చనిపోయాడు. ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది... కుటుంబసభ్యులకు తెలియచేశారు. ఎవరూ రాలేదు. పోలీసులకు సమాచారమివ్వగా... మున్సిపల్ సిబ్బంది సాయంతో పట్టణంలోని నందినగర్ శివారులో అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్లారు. వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఇక్కడ అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారని స్థానికులు అడ్డుకున్నారు. గత్యంతరం లేని పరిస్ధితుల్లో... మళ్లీ మృతదేహాన్ని మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత బయ్యారం అటవీ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో 50 వేలు దాటిన కరోనా కేసులు