బాబాయి భార్యతో సరదగా చెరువుకు వెళ్లిన ఇద్దరూ చిన్నారులు ప్రమాదవశాత్తు జేసీబీ గుంతలో పడి మరణించిన ఘటన మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలం రహీంగూడలో చోటుచేసుకుంది. బొగ్గుల దశరథ, నాగరాణికి అనూష(12), వినయ్(10) ఇద్దరు పిల్లలు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. నిత్యం కూలీ పని నిమిత్తం ఇతర గ్రామాలకు వెళ్తుంటారు.
ప్రతిరోజు పిల్లలిద్దరూ బాబాయి భార్య లావణ్యతో కలిసి ఉండేవారు. రోజు మాదిరిగానే పిన్నితోపాటు చెరువుకు వెళ్లారు. పిన్ని దుస్తులు ఉతుకుతుండగా ఇద్దరు పిల్లలు ఆ పక్కనే ఆడుకుంటున్నారు. ఒక్కసారిగా పిల్లలిద్దరూ గుంతలోకి జారిపోతూ అరిచారు. వెంటనే స్పందించిన పిన్ని వారిని కాపాడేందుకు చీరను వారి వైపు విసిరింది. పిల్లలు ఎంత తండ్లాడినా అందుకోలేక పోయింది. గుంత లోపలికి మునిగిపోయారు.
లావణ్య కేకలు పెడుతూ కొద్ది దూరంలోని గ్రామస్థులకు చెప్పింది. వారు వెంటనే చెరువులోకి దూకి అక్క, తమ్ముడి మృతదేహాలను బయటకు తీశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని ‘అప్పుడే నూరేళ్లు నిండాయా.. బిడ్డలారా' అంటూ రోదించారు. గ్రామ ప్రజలు సైతం విషాదాన్ని తట్టుకోలేక కంటతడి పెట్టారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో అనూష, వినయ్ 5, 3 తరగతులు చదువుతున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:పెళ్లయిన పదహారు రోజులకే యువతి ఆత్మహత్య