ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎనిగబాలలో పెళ్లి వేడుక జరుగుతుండగా ఆడుకుంటూ వెళ్లిన బాలిక సాంబారులో పడి మృతి చెందింది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రామాంజనేయులు, విజయలక్ష్మి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం. బాలిక తండ్రి ఇంటికి ఎదురుగా జరుగుతున్న వివాహ వేడుకకు వెళ్లారు. ఆయన వెంటే బాలిక ఆడుకుంటూ ముందుకు వెళ్లింది. అక్కడ వండిన సాంబారు గిన్నెలో ప్రమాదవశాత్తూ పడిపోయింది. ప్రమాదాన్ని గుర్తించేసరికి చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో పాప మృతి చెందింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చదవండి: కదనరంగాన్ని తలపించిన యుద్ధవిమాన విన్యాసాలు