సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అల్మైపేట్ గ్రామ శివారులో చిరుత పులుల సంచారం కలకలం రేపింది. చిరుత సంచారంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన కిష్టయ్య కొన్నాళ్లుగా గ్రామ శివారులోని విద్యుత్ ఉపకేంద్రం పక్కనే ఉన్న పొలానికి కాపలాదారుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 7:30 గంటల సమయంలో కిష్టయ్య, అతని స్నేహితులు విశ్వనాథం గౌడ్, దశరథ్లు పొలం వద్ద ఉన్న గది ముందు కూర్చున్నారు. పక్కన ఏదో అలికిడి కావడం వల్ల చరవాణి లైట్ వేసి చూశారు. చిరుత కనిపించటంతో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.
రాత్రి 11:30 గంటల సమయంలో మరోసారి చప్పుడు కావడం వల్ల కిటికీలోంచి చూడగా.. తల్లితో పాటు రెండు చిరుత పిల్లలను చూసినట్టు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు జోగిపేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
పులి పంజా గుర్తుల ఫొటోలు తీసి అటవీశాఖ అధికారులకు పంపించినట్లు ఎస్సై ప్రభాకర్ పేర్కొన్నారు. ఆ గుర్తులు అడవిపిల్లికి సంబంధించినవిగా ఉన్నాయని.. ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తామని అటవీశాఖ అధికారులు చెప్పినట్లు ఆయన తెలిపారు.