ఆర్మీ ఉన్నతాధికారినంటూ పలువురిని మోసం చేసిన శ్రీను నాయక్ అనే వ్యక్తిని ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి ఖరీదైన మూడు కార్లు, 3 నకిలీ పిస్టళ్లు, ఆర్మీ దుస్తులు, రూ.85వేల నగదుతో పాటు... నకిలీ విద్యార్హత పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ ఉన్నతాధికారినని చెప్పి పెళ్లి పేరుతో దాదాపు 17మంది మహిళలను నమ్మించి రూ.6.6కోట్లకు పైగా వసూలు చేశాడని పోలీసులు వెల్లడించారు.
ప్రకాశం జిల్లా కెల్లంపల్లికి చెందిన శ్రీను నాయక్‌కు 2002లో వివాహమైంది. 9వ తరగతి వరకే చదివిన శ్రీను నాయక్ ఆ తర్వాత దూరవిద్య ద్వారా పీజీ పూర్తి చేశాడు. ఆయన భార్య ప్రభుత్వ ఉద్యోగినిగా పనిచేస్తోంది. కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. 2014లో హైదరాబాద్‌కు వచ్చిన శ్రీను నాయక్ సైనిక్ పురిలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆర్మీ అధికారి అవతారం ఎత్తాడు.
కుటుంబ సభ్యులనూ ఆర్మీ ఉద్యోగం వచ్చిందని నమ్మించాడు. అవివాహితుడిగా నమ్మించి పలువురి మహిళలను పెళ్లి చేసుకుంటానని చెప్పి డబ్బులు వసూలు చేశాడు. వరంగల్‌కు చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అమ్మాయి తండ్రి నుంచి ఏకంగా రూ.రెండున్నర కోట్లు వసూలు చేశాడు. మరో మహిళ నుంచి రూ.52లక్షలు వసూలు చేశాడు. శ్రీను నాయక్‌పై జవహార్ నగర్, వరంగల్‌లోని సుబేదారి ఠాణాలోనూ కేసులున్నాయని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: రెండోరోజూ సీఐ జగదీశ్ ఇంట్లో ఏసీబీ సోదాలు