మహిళల మెళ్లో నుంచి బంగారు గొలుసులను దొంగతనం చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను మహబూబ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.7 లక్షల విలువైన 13 తులాల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన యువకునితో పాటు కోస్గి మండలం గుండుమాల్‌కు చెందిన మరో ఇద్దరు ముఠాగా ఏర్పడి పట్టణంలో... నాలుగు నెలలుగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్టు అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
ద్విచక్రవాహనాలపై వచ్చి మహిళల మెళ్లో నుంచి బంగారు గొలుసులను లాక్కెళ్లేవారని... పట్టణంలోనే 7 కేసులు నమోదయ్యాయని తెలిపారు. సొమ్ములన్నింటితో పాటు రెండు ద్విచక్రవాహనాలను స్వాదీనం చేసుకున్నట్లు వివరించారు. మెట్టుగడ్డ ప్రాంతంలో వాహన తనిఖీలు జరుగుతున్న సందర్భంలో అనుమానాస్పదంగా కన్పించిన యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా... అసలు విషయం బయటపడిందని తెలిపారు.
ముగ్గురు నిందితులు మద్యం, జల్సాలకు అలవాటు పడ్డారని.. డబ్బులు సరిపోక చైన్‌స్నాచింగ్ చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని వివరించారు. నిందుతులను రిమాండ్‌కు తరలిస్తామని.. స్వాధీనం చేసుకున్న సొత్తును కోర్టు ద్వారా బాధితులకు అందజేస్తామని అదనపు ఎస్పీ తెలిపారు.