కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో వాంకిడి మండలం కోమటిగూడలోని వాగులో ఎద్దుల బండి చిక్కుకుని ఓ ఎద్దు మృతి చెందింది.
గ్రామానికి చెందిన ఓ రైతు చేను పనులు ముగించుకుని ఎద్దులబండిపై ఇంటికి వస్తూ వాగు దాటుతుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. ఫలితంగా ఎద్దుల బండి నీటిలో చిక్కుకుపోయింది. ఈ క్రమంలో ఊపిరాడక ఒక ఎద్దు చనిపోయింది. నీటి ప్రవాహానికి ఎద్దులబండి కొట్టుకుపోతుండగా.. గుర్తించిన స్థానికులు రైతును, మరో ఎద్దును ఒడ్డుకు చేర్చారు. పంటలు వేసుకునే సమయంలో ఎద్దు మృతి చెందడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరాడు.