చేతబడి, మూఢనమ్మకాల నెపంతో కొందరు నిందితులు ఓ అభాగ్యురాలిని హత్య చేసినట్టు యాదాద్రి జిల్లా భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. జనవరి 31న సంస్థాన్ నారాయణపురం మండలం గాంధీనగర్‌లో జరిగిన ఈ హత్య కేసుని ఛేదించినట్టు వెల్లడించారు. తొమ్మిది మంది నిందితుల్లో.. ఏడుగురిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు చెప్పారు. తండాకి చెందిన మేఘావత్ నర్సింహ తమ్ముడు కొద్ది రోజుల క్రితం ఆకస్మికంగా చనిపోయాడు. తర్వాత తన కోళ్ల ఫాంలో 250 కోళ్లు చనిపోయాయి. కొంత కాలంగా భార్య కూడా అనారోగ్యంతో బాధపడుతుంది. వీటన్నింటికీ అదే గ్రామానికి చెందిన బుజ్జి చేతబడే కారణమని నర్సింహా బలంగా నమ్మాడు.
జనవరి 31న.. భర్త గణేష్, అత్త సభావత్ నజమ్మ, బుజ్జి సంస్థాన్ నారాయణపురానికి బయలుదేరింది. గణేష్, నజమ్మ ఒక బైక్‌పై.. అదే గ్రామానికి చెందిన ఎడ్ల నర్సింహ బైక్‌పై బుజ్జి వెళ్తున్నారు. ఈ విషయాన్ని మేఘావత్ నర్సింహ తన తమ్ముడు నగేష్‌కి చేరవేశాడు. నగేష్ తన స్నేహితులతో కలిసి.. బుజ్జి ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టారు. కింద పడ్డ బుజ్జిని కారులో రాచకొండ సమీపంలోని ఓ గుట్టపైకి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న ప్రధాన నిందితుడు మేఘావత్ నర్సింహ.. రాయితో బుజ్జి తలపై కొట్టాడు. అనంతరం మెడకు చీర బిగించి చంపేశాడు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు విచారణ జరిపి గాంధీనగర్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు డీసీపీ తెలిపారు. మూఢనమ్మకాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: జైలుకు పంపిందన్న కక్షతో.. వివాహితపై గొడ్డలి దాడి