ఈఎస్ఐ బీమా సేవల కుంభకోణంలో అనిశా అరెస్టు చేసిన నలుగురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఓమ్నీ ఎండీ యజమాని కంచర్ల శ్రీహరి బాబు అలియాస్ బాబ్జీ, కంచర్ల సుజాత, కృపాసాగర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డిలను ఈనెల 3న అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. నలుగురు నిందితుల పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
విచారణకు సహకరించాలని.. ప్రతీ గురువారం ఏసీబీ దర్యాప్తు అధికారుల ఎదుట హాజరు కావాలని హైకోర్టు పేర్కొంది. ఏడాది క్రితం ఏసీబీ నమోదు చేసిన కేసు దర్యాప్తు ఇప్పటికీ పూర్తి కాలేదని.. తాజాగా నమోదు చేసిన కేసులో కొత్త విషయాలేవీ లేవని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నిందితులు గతంలోనూ జైళ్లో ఉన్నారని పేర్కొంటూ బెయిల్ మంజూరు చేసింది.