నిషేదిత పొగాకు, అంబర్ ప్యాకెట్లు, గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను కరీంనగర్ జిల్లా కేశవపట్నం పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి భారీగా అంబర్ ప్యాకెట్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.10.3 లక్షల వరకు ఉంటుందని హుజూరాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్‌రావు తెలిపారు.
సీఐ ఎర్రల కిరణ్ ఆధ్వర్యంలో ఎస్సై రవి కేశవపట్నం నుంచి ముత్తారం వైపు పెట్రోలింగ్ కోసం వెళ్తుండగా.. మక్తా గ్రామం మూల మలుపు వద్ద ఒక కారు అనుమానాస్పదంగా కనిపించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. తనిఖీ చేయగా అందులో 10 సంచుల నిషేధిత పొగాకు ప్యాకెట్లు, 1.85 గ్రాముల గంజాయిని గుర్తించినట్లు తెలిపారు. వీటి విలువ రూ.7,63,500లు ఉంటుందని వివరించారు. కారుతో పాటు నిందితులు రావికంటి సంతోశ్, కొమ్మ నరేందర్‌లను అదుపులోకి తీసుకున్నామన్నారు.
మరో విశ్వసనీయ సమాచారం మేరకు శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన చందా వేణు గోపాల్ అనే వ్యక్తి కిరాణ దుకాణంలో తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. 3 సంచుల అంబర్ ప్యాకెట్లను పట్టుకున్నామన్నారు. వీటి విలువ రూ.2.40 లక్షలు ఉంటుందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు.
ఈ సందర్భంగా నిషేధిత పొగాకు ఉత్పత్తుల అక్రమ వ్యాపారాలు చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాని ఏసీపీ హెచ్చరించారు. ఈ మేరకు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. ఈ సందర్భంగా సీఐ, ఎస్సైలను ఏసీపీ అభినందించారు.