తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ వేదికగా పెట్టుబడి, మార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని నర్సీపట్టణానికి చెందిన నందకిషోర్, విశాఖపట్టణానికి చెందిన భూమిరెడ్డి అవినాశ్ రెడ్డి, చిట్టంరెడ్డి, తుళ్లూరు శ్రీనివాస్.. ఒక బృందంగా ఏర్పడి యూకే ఆధారిత నకిలీ "స్టెమ్కార్ మాక్స్ హెడ్జ్" పేరిట యాప్, వెబ్సైట్ www.stemcarmaxhedge.com సృష్టించారు.
విదేశీ బహుళ జాతి కంపెనీ తరహా అని మంచి సదాభిప్రాయం కల్పించడంతో కస్టమర్లు విశ్వసించారు. లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే రోజూ ఐదు శాతం చొప్పున కమీషన్ ఇవ్వడం సహా.. 60 రోజుల తర్వాత అసలు ఇస్తామంటూ నమ్మబలకడంతో కస్టమర్లు ఆకర్షితులయ్యారు. లండన్ వర్చువల్ మొబైల్ వాట్సాప్ నంబర్లు +44-13222522443, +44-1474770338 ఏర్పాటు చేసి.. దాదాపు 2,500 మంది నుంచి 10 వేల నుంచి లక్ష రూపాయల చొప్పున.. డిపాజిట్లు రూ.7 కోట్లు ఆన్‌లైన్‌లో వసూలు చేసి కొన్ని రోజులపాటు కమీషన్ ఇచ్చారు.
మరో కస్టమర్‌ను పరిచయం చేసి లక్ష రూపాయలు డిపాజిట్ చేయిస్తే అదనంగా 10 శాతం కమీషన్ ఇస్తామంటూ ప్రలోభాలకు తెరతీశారు. అంతే.. అసిస్టెంట్ ఇంజినీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు పెద్ద ఎత్తున డబ్బులు పెట్టుబడి పెట్టి మోసపోయారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. నిందితుల నుంచి 4 చరవాణిలు, 1 సిమ్ కార్డు, కారు, 380 చదరపు అడుగుల ఇంటి స్థలం పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ చెప్పారు.
ఈ ముఠా సొమ్మును డాలర్లు, పౌన్స్ రూపంలో వసూలు చేసింది. చివరకు పెద్ద ఎత్తున డబ్బు రావడంతో బయపడిపోయి... ఆన్‌లైన్ వ్యాపారం ఆపేశారని తెలిపారు. ఇకనైనా ఇలాంటి ప్రకటనలు చూసి ప్రజలు మోసపోవద్దని.. ఆ కంపెనీ విశ్వసనీయత, గత చరిత్ర చూడాలని సూచించారు. కేసును ఛేదించిన డీసీపీ రోహిణి, ఏపీసీ బాలకృష్ణ, సీఐ సంజయ్కుమార్ను సీపీ అభినందించారు.
ఇదీ చూడండి: లబ్... డబ్... లబ్... డబ్... కేవలం 24 గంటలే!