ఆదిలాబాద్ తాటిగూడ కాలనీలో చోటు చేసుకున్న కాల్పుల ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. పాతకక్షలతో రాజకీయ ప్రత్యర్థుల మధ్య జరిగిన ఘర్షణ... చిలికిచిలికి కాల్పులు చేసుకునేంత స్థాయికి వెళ్లింది.
అసలేం జరిగిందంటే...
గత మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం తరఫున ఫారుఖ్ భార్య బరిలో నిలవగా.. తెరాస నుంచి జమీల్ బంధువు వసీం భార్య పోటీ చేశారు. ఫారుఖ్ భార్య గెలుపొందగా.. వసీం వర్గం ఓటమి పాలైంది. అప్పటి నుంచి ఇరువైర్గాల నడుమ తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పిల్లలు క్రికెట్ ఆడటం.. ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి కాల్పులకు పాల్పడటం జరిగింది.
తొలుత పరస్పరం దాడులకు దిగిన క్రమంలో సహనం కోల్పోయిన ఎంఐఎం నేత ఫారుఖ్ ఒకచెత్తో కత్తి, మరో చెత్తో తుపాకితో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో జమీల్ శరీరంలో రెండు తూటాలు, మన్నన్, మోతేషాన్ శరీరాల్లో ఒక్కో తూటా దిగింది. కుప్పకూలిన ఆ ముగ్గురిని స్థానికులు హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఫారుఖ్‌ను వెంటనే అదుపులోకి తీసుకుని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. ఆయన వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఓఎస్‌డీ రాజేశ్చంద్ర వెల్లడించారు.
ప్రశాంతంగా ఉన్న ఆదిలాబాద్ పట్టణాన్ని ఈ కాల్పుల ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన దృష్ట్యా... పట్టణంలో ఎలాంటి అల్లర్లు చోటుచేసుకోకుండా పోలీసులు నిఘా పెంచారు.