వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం మడికొండలో ఆదివారం రాత్రి రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో జవ్వాజి వేణు అనే రైల్వే ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు.
కాజీపేట్ బాపూజీనగర్‌కు చెందిన జవ్వాజి వేణు సొంత పని నిమిత్తం బైకుపై ఆదివారం మడికొండకు వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో కాజీపేట్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో మడికొండ నుంచి కాజీపేట్ వైపునకు వెళుతున్న ఓ లారీ.. వెనక నుంచి వేగంగా బైకును ఢీకొంది. ప్రమాదంలో వేణు అక్కడికక్కడే మృతి చెందాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.