నకిలీ పాసు పుస్తకాలు జారీ చేసిన కేసులో కీసర మాజీ తహసీల్దార్ నాగరాజును కస్టడీకి ఇవ్వాలంటూ అనిశా అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తులో పురోగతి కోసం నాగరాజును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. కీసర మండలం రాంపల్లి దాయరలో దాదాపు 24 ఎకరాల భూమికి తహసీల్దార్ నాగరాజు.... ధర్మారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పేరుమీద నకిలీ పాసుపుస్తకాలు జారీ చేశారు.
ఈ భూమికి సంబంధించిన కేసు ఆర్డీఓ కార్యాలయంలో పెండింగ్లో ఉన్నప్పటికీ.... అదేమీ పట్టించుకోకుండా తహసీల్దార్ నాగరాజు నకిలీ పాసుపుస్తకాలు జారీ చేసినట్లు అనిశా అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. నకిలీ పాసు పుస్తకాలు ఇచ్చేందుకు దాదాపు 2 కోట్ల రూపాయల ఒప్పందం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. రాంపల్లి దాయరలోనే వివాదాస్పద భూమి విషయంలో స్థిరాస్తి వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరించేందుకు నాగరాజు కోటి 10లక్షల లంచం తీసుకుంటూ ఆగస్టు 14న అనిశా అధికారులకు పట్టుబడ్డారు.
ఈ కేసులో నాగరాజుతో పాటు వీఆర్ఏ సాయిరాజు, స్థిరాస్తి వ్యాపారులు అంజిరెడ్డి, శ్రీనాథ్లను అరెస్ట్ చేశారు. అంజిరెడ్డి, శ్రీనాథ్, సాయిరాజ్లకు అనిశా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నకిలీ పాసుపుస్తకాల కేసులో నిందితుడిగా ఉన్న తహసీల్దార్ నాగరాజు మాత్రం చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నాగరాజును కస్టడీలోకి తీసుకుంటే నకిలీ పాసు పుస్తకాల కేసులో మరింత పురోగతి సాధించే అవకాశం ఉందని అనిశా అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి : హేమంత్ హత్యకేసులో కస్టడీకి మరో ఏడుగురు నిందితులు