ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. రోజురోజుకు వేధింపులు ఎక్కువయ్యాయి. ఆగ్రహించిన ఆ యువకుడిపై ఆకతాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను మళ్లీ ఆమె జోలికిరానని యువకుడు రాజీకి రాగా కేసు వాపసు తీసుకుంది. తన ప్రేమను కాదనడమే కాకుండా.. పోలీసులకు ఫిర్యాదు చేసిందనే ఆగ్రహంతో ఊగిపోయిన ఆ యువకుడు.. మాటు వేసి ఆమెపై దాడి చేశాడు. పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. నిప్పంటుకుని తీవ్రంగా గాయపడిన యువకుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
పోలీసులకు ఫిర్యాదు...
కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన చిన్నారి అనే యువతి విజయవాడలోని ఓ కొవిడ్ కేర్ సెంటర్లో నర్సుగా పని చేస్తుంది. స్నేహితురాళ్లతో కలిసి ఆస్పత్రికి సమీపంలోనే ఓ గది అద్దెకు తీసుకుని ఉంటోంది. రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి చిన్నారిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీనిపై ఆమె నాలుగు రోజుల కిందట గవర్నర్‌పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ యువకుడ్ని పిలిచి హెచ్చరించగా.. ఆమెను ఏమీ చేయనని రాతపూర్వక హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఫిర్యాదును చిన్నారి వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది.
మాటు వేసి కాటేశాడు...
రోజులానే సోమవారం విధులకు హాజరైన చిన్నారి రాత్రి 8 గంటలకు విధులను ముగించుకుని ఒంటరిగా ఇంటికి వెళుతుండగా.. మాటు వేసిన నాగభూషణం ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నాగభూషణం ముందుగానే తనతో తెచ్చుకున్న పెట్రోల్‌ను చిన్నారిపై పోసి నిప్పంటించాడు. ఈ సమయంలో అతనికీ మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్రగాయాలైన నాగభూషణాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించినట్లు సమాచారం.
ఇదీ చదవండి