నల్గొండ జిల్లా నిడమనూరులో నివాసం ఉంటున్న పున్న హేమలత... కూరగాయలమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటుంది. ఓ రోజున ఆమె దగ్గరికి.... ఇల్లు అద్దెకు కావాలంటూ వెంకటేశ్వరరెడ్డి దంపతులు వాచ్చారు. తన ఇంట్లో ఖాళీగా ఉన్న రెండు గదులను వెంకటేశ్వర్‌రెడ్డికి కిరాయికి ఇచ్చింది. రెండు నెలలు గడిచాక... తమ దగ్గర బంగారు బిస్కెట్లు ఉన్నాయని హేమలతకు వెంకటేశ్వర్‌రెడ్డి దంపతులు తెలిపారు. తమకు కొంత డబ్బు అవసరముందని... బంగారం తీసుకుని డబ్బు సర్దాలని కోరారు.
తక్కువకు ఇస్తానని ఆకర్షించి...
హేమలత స్పందించి.. బంగారం తీసుకుని 1లక్షల 40 వేలు ఇచ్చింది. తీసుకున్న బంగారంతో కుమారుడికి ఉంగరం చేయించింది. తమకు మళ్ళీ డబ్బు అత్యవసరం ఉందని ఉన్న బంగారం మొత్తం అమ్ముతున్నామని హేమలతకు చెప్పారు. తనకైతే తక్కువ ధరకు ఇస్తామంటూ హేమలతను నమ్మించారు. ముప్పావు కేజీల బంగారు కడ్డీలను కేవలం రూ.5 లక్షలకే ఇస్తానని ఒత్తిడి తెచ్చారు. వారి మాటలకు హేమలత ఆకర్షితురాలైంది. వెంటనే తన ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మరీ రూ. 5 లక్షలను వెంకటేశ్వర రెడ్డికి ఇచ్చింది.
ఎవరికీ చెప్పొద్దన్నాడు...
మొదటిసారి నిజమైన బంగారమే ఇచ్చిన వెంకటేశ్వర్‌రెడ్డి... ఈసారి మాత్రం ఏకంగా ముప్పావు కేజీ నకిలీ బంగారు కడ్డీలను హేమలకు ఇచ్చాడు. ఈ విషయం బయట ఎవరికి చెప్పొద్దని కోరాడు. బంగారు కడ్డీలను హేమలత తన కూతురు దగ్గరకు తీసుకెళ్లగా... ఆమె అల్లుడు బంగారు దుకాణంలో చూపించాడు. పరిక్షించిన యజమాని అది బంగారం కాదని చెప్పగా... అవాక్కవటం హేమలత వంతైంది.
హుటాహుటిన హేమలత ఇంటికి తిరిగి వచ్చేసరికి... దుండగుడు వెంకటేశ్వర రెడ్డి ఇల్లు ఖాళీ చేసి పరారయ్యాడు. మోసపోయిన విషయం గ్రహించి బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.