అన్నా.. ఎవ్వరిని ప్రేమించకండి.. ఎవరినైనా ప్రేమించినా చచ్చేదాక మన వెంట ఉంటారో ఒకసారి చెక్ చేసుకోండని కరీంనగర్లో ఓ యువకుడు సెల్ఫీ రికార్డు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకంటే జీవితంలో సంతోషంగా ఉండాలి. మనం అనుకున్నోళ్లు మనతో లేకపోతే సంతోషంగా ఉండలేము. అందరూ ఫ్రెండ్స్.. నా గల్లీ దోస్త్‌లు.. టెన్త్ దోస్త్‌లు.. ప్రతి ఒక్కరికి ఇక వీడ్కోలు..!’’ అంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునే ముందు చరవాణిలో సెల్పీ వీడియోలో మాట్లాడాడు. ఆదివారం కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. హృదయవిదారకంగా తన బాధను వెళ్లగక్కుతూ బలవన్మరణానికి పాల్పడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
మనస్పర్థలు రావడం
నగరంలోని సప్తగిరికాలనీకి చెందిన పాములపర్తి సాయికిరణ్(29)ఓ చరవాణి సంస్థకు సంబంధించి పెద్దపల్లి, గోదావరిఖనిలో సిటీ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతిని కొన్నాళ్లుగా ప్రేమించాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం వల్ల ఆ యువతి సాయికిరణ్‌తో పెళ్లికి నిరాకరించింది. తీవ్ర మనోవేదనకు గురైన అతను ఈనెల 10న తన బాధను వీడియో ద్వారా చిత్రీకరించి బంధువులకు, స్నేహితులకు పంపించాడు.
కేసు దర్యాప్తు
ప్రేమించొద్ధూ అని చెబుతూనే.. మిత్రులకు ఇక సెలవంటూ.. తన చేతిలో ఉన్న పురుగుల మందును తాగి కిందపడిపోయాడు. విషయం తెలుసుకున్న స్నేహితులు, కుటుంబీకులు పద్మానగర్ శివారు ప్రాంతంలో పడిపోయి ఉన్నాడని గుర్తించి చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ సాయి కిరణ్ మృతి చెందాడు. తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రెండో ఠాణా ఎస్సై టి.మహేష్ వివరించారు.
ఇదీ చూడండి : ఈ దాడి మతోన్మాద శక్తుల పనే..!: చాడ వెంకట్ రెడ్డి