జాతర జరుగుతుండగా విద్యుదాఘాతం జరిగి ఓ ఇంట్లో నగదు, సామగ్రి దగ్ధమైంది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్‌లో ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రూ.1,87,000 నగదు, ఇంట్లో సామగ్రి బూడిదయ్యాయి.
గ్రామంలో నిరంజన్ షా వలీ దర్గా జాతర జరుగుతోంది. వేడుకల్లో అత్యధికంగా దుకాణాలు ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కసారిగా విద్యుత్ వోల్టేజ్ అధికం కాగా.. మూడావత్ సర్రాంకు చెందిన ఇల్లు దగ్ధమైంది. తీవ్ర నష్టం వాటిల్లింది. ఇంట్లో ఉన్న ఫ్రిజ్, టీవీ, బీరువా, సిలిండర్, వస్త్రాలు, సామగ్రి, బియ్యం పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతింది. కుటుంబ అవసరాల కోసం అప్పుగా తెచ్చుకున్న నగదు దగ్ధం కావడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.