హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని.. ఓ టీవీ రిపేర్ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూకట్‌పల్లి రామాలయం వీధిలోని సాయిఅఖిల్ అనే ఓ టీవీ సర్వీసింగ్ సెంటర్‌లో.. ఒక్కసారిగా పొగలు అలుముకున్నాయి.
పొగలను గమనించిన స్థానికులు.. షాపు షెటర్ తెరిచి చూసే సరికి సర్వీసింగ్ సెంటర్ లోపల భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికులు మంటలను అదుపులోకి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకుని వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు షాపు యజమాని రమేష్.. షెటర్ కిందకి వేసి ఇంటికి వెళ్లిన సమయంలో... విద్యుదాఘాతం వల్ల మంటలు వ్యాపించాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిప్రమాదంలో సుమారు 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు.. అధికారులు అంచనా వేస్తున్నారు.