ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి కింద పడి బాలుడు మృతి చెందిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ హిల్స్‌లో నివాసం ఉంటున్న ప్రవీణ్ అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు శ్రీ హరీష్, రాహుల్ ఉన్నారు. వారిద్దరూ బిల్డింగ్‌లోని రెండవ అంతస్తులో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నారు. ఆడుకున్న తర్వాత కిందకు దిగుతున్న సమయంలో రాహుల్ ప్రమాదవశాత్తు మెట్ల పై నుంచి కింద పడ్డాడు. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కొంపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పోస్టుమార్టం నిమిత్తం చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అల్లారు మద్దుగా పెంచుకున్న కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఇదీ చదవండి: ఆన్లైన్ అప్పులకు సాఫ్ట్వేర్ ఇంజినీరు బలి