వరుసగా కురుస్తున్న వర్షాలకు జలకళను సంతరించుకున్న ప్రాజెక్టులను చూసేందుకు వెళ్లి ఓ యువకుడు గల్లంతైన విషాదకర ఘటన మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అల్లీపూర్లో చోటుచేసుకుంది. కోయిల్‌సాగర్ జలాశయం నుంచి వస్తున్న వరద నీరు బండర్‌పల్లి మీదుగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. అల్లీపూర్ సమీపంలో నిర్మించిన చెక్‌డ్యాం వద్ద జల సవ్వడిని తిలకించేందుకు ఓ కుటుంబం వెళ్లింది.
తల్లిదండ్రులతో కలిసి సెల్ఫీ దిగేందుకు అన్నాచెల్లెల్లు ప్రయత్నించగా... అమ్మాయి పట్టు తప్పి జారింది. తల్లిదండ్రులు వెంటనే స్పందించి బాలికను పట్టుకున్నారు. కానీ... అదే సమయంలో చెల్లెల్ని పట్టుకునేందుకు యత్నించిన అన్న మాత్రం కాలుజారి నీటిలో పడ్డాడు. వరద ఉద్ధృతికి బాలుడు కొట్టుకుపోయాడు. కళ్లెదుటే కన్నకొడుకు నీటిలో కొట్టుకు పోతుంటే తల్లిదండ్రులు ఏంచేయాలో పాలుపోక నిస్సహాయ స్థితిలో నిలిచిపోయారు. ఆ తల్లిదండ్రుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు నిండిపోయాయి.
![a boy drown and died in river at allipur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-mbnr-14-20-yuvakudu-gaalanthoo-av-ts10094_20082020183340_2008f_1597928620_559.jpg)