వికారాబాద్ జిల్లాలో కల్లు ఒకరి ప్రాణాలు తీసింది. పదుల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు. వికారాబాద్, నవాబ్‌పేట్ మండలాల్లో జరిగిన ఈ ఘటనపై ఎక్సైజ్‌శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కల్లు నమునాలు సేకరించి సోదాలు చేస్తున్నారు.
ఐదు గ్రామాల్లో...
వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. కల్లు తాగి ఒకరు మృతిచెందగా... పలువురు అస్వస్థతకు గురయ్యారు. మొత్తం ఐదు గ్రామాల్లో కల్లు తాగి పదుల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు. వికారాబాద్ మండలం పెండ్లిమడుగులో కల్లు తాగి అస్వస్థతకు గురైన కృష్ణారెడ్డి అనే వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. ఎర్రవల్లిలోనూ కల్లు ప్రభావంతో పలువురు ఆసుపత్రి పాలయ్యారు. నవాబుపేట మండలం చిట్టిగిద్దలోనూ కల్లుతాగిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న 10 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్‌కు స్థానికులు సమాచారం అందించగా... డీఎంహెచ్ఓతో మాట్లాడారు. తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
గ్రామాల్లో కల్లు నమునాలు సేకరించిన ఆబ్కారీశాఖ అధికారులు ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. వికారాబాద్, నవాబ్‌పేట్ మండలాల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.వి.ప్రసాద్ నేతృత్వంలో తనిఖీలు చేస్తున్నారు.