కరోనా సంక్షోభంతో ప్రపంచాన్ని 'ఆకలి' అనే మహమ్మారి ముంచేస్తుందని ఐరాస అనుబంధ సంస్థ ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యూఎఫ్‌పీ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు వీలైనంత త్వరగా స్పందించకపోతే కొద్ది నెలల్లోనే కరవు తాండవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
"కొవిడ్-19తో పోరాడుతున్న మనకు ఆకలి అనే మహమ్మారి సమీపిస్తోంది. ప్రస్తుతానికి కరవు పరిస్థితి లేదు. కొరతను అధిగమించేందుకు త్వరగా స్పందించి, వాణిజ్యానికి నిధులు సమకూర్చుకోకపోతే మాత్రం రానున్న కొన్ని నెలల్లో కరవు సంభవిస్తుంది."
- డేవిడ్ బేస్లీ, ప్రపంచ ఆహార కార్యక్రమం ఈడీ
అయితే ఆకలి సమస్య ఇప్పటిది కాదని.. రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచే ఈ సమస్య ప్రపంచాన్ని పీడిస్తుందనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 82.1 కోట్ల మంది ప్రజలు ఆకలితోనే నిద్రపోతున్నారు. 13.5 కోట్ల మందికి ఆహార కొరత తీవ్రంగా ఉంది. కరోనా కారణంగా ఈ ఏడాది మరో 13 కోట్ల మంది ఈ జాబితాలో చేరే ప్రమాదం ఉందని డబ్ల్యూఎఫ్‌పీ విశ్లేషణలో తేలినట్లు బేస్లీ తెలిపారు.
డబ్ల్యూఎఫ్‌పీ ప్రస్తుతం 10 కోట్ల మందికి ఆహారం సమకూరుస్తోంది. కొన్ని రోజుల క్రితం వరకు 8 కోట్ల మందికి అందించేది. ఈ పెరుగుదల లేకపోతే మూడు నెలల్లో 3 లక్షల మంది ఆకలితో మరణించేవారని తెలిపింది డబ్ల్యూఎఫ్‌పీ.
ఇదీ చూడండి:కరోనా మహమ్మారి ఊపిరి తీస్తుందిలా..!