అఫ్గానిస్థాన్లో ఉన్న అమెరికా, నాటో తుది దశ బలగాల ఉపసంహరణ శనివారం అధికారికంగా ప్రారంభమైంది. అమెరికాకు చెందిన సుమారు 3,500 మంది సైనికులు సహా నాటోకు చెందిన 7000 మంది అఫ్గానిస్థాన్ నుంచి తిరుగు ప్రయాణం కానున్నట్లు సమాచారం.
ఈ బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఏప్రిల్ నాటికే పూర్తి కావాల్సి ఉన్నా.. దానిని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వాయిదా వేశారు.
భద్రతకు ముప్పు?
బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఈ ఏడాది సెప్టెంబరు 11 నాటికి పూర్తికానుంది. అయితే ఈ క్రమంలో తాలిబన్లు.. బలగాలపై దాడి చేసే అవకాశం ఉందని సైనిక వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా, నాటో బలగాలపై ఎలాంటి దాడి జరపమని తాలిబన్లు స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ విషయంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తాలిబన్ వర్గాలు పేర్కొన్నాయి.
ఉపసంహరణపై అమెరికా తొలుత ప్రకటించిన తుది గడువును ఉల్లంఘించడం ద్వారా తమకు ప్రతిదాడి చేసే అవకాశం కల్పించిందని తాలిబన్ భావిస్తోంది. ఈ విషయాన్ని తాలిబన్ సైనిక ప్రతినిధి జబీనుల్లా ముజాహిద్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే దేశ పరిస్థితులు, సార్వభౌమత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు అమెరికా గత 20 ఏళ్లలో 2 ట్రిలియన్ డాలర్లకుపైగా ఖర్చు చేసినట్లు బ్రౌన్ విశ్వవిద్యాలయానికి చెందిన విశ్లేషకులు వెల్లడించారు.
హామీలకు కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నాం..
అఫ్గానిస్థాన్లో శాంతి భద్రతలకు తాలిబన్లు కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నామని అమెరికా, రష్యా, చైనా, పాకిస్థాన్లు పేర్కొన్నాయి. పూర్తిస్థాయిలో శాంతి నెలకొల్పేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆయా దేశాల ప్రతినిధులు శుక్రవారం దోహాలో తాలిబన్, అఫ్గాన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రతినిధులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
"అఫ్గానిస్థాన్లో శాంతిభద్రతలకు తాలిబన్లు కట్టుబడటం, ఇతర దేశాల భద్రతకు ముప్పు తెచ్చే కార్యకలాపాలకు పాల్పడకుండా ఉంటాయని భావిస్తున్నాము. అదే విధంగా అఫ్గాన్ ప్రభుత్వం కూడా ప్రపంచ దేశాల సాయంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన పోరును కొనసాగిస్తుందని ఆశిస్తున్నాము. స్థానికులపై జరిగే దాడులను మేము ఖండిస్తున్నాం. అఫ్గానిస్థాన్లో సైనిక చర్యలతో శాంతి నెలకొల్పలేము. కేవలం చర్చల ద్వారానే అది సాధ్యం అవుతుంది."
-సంయుక్త ప్రకటన
ఇదీ చదవండి : అమెరికాలో 10 కోట్ల మందికి వ్యాక్సిన్