ప్రస్తుత కాలంలో వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మితిమీరిన వేగంతో వాహనాలను నడుపుతూ ఎంతోమంది తమ ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. కొన్నిసార్లు మనం చూస్తుండగానే ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో క్షతగాత్రులకు సహాయం చేయడటానికి బదులు ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంటారు. అయితే ఈ అంశంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక నిర్ణయం తీసుకుంది.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన, మృతిచెందిన వారి ఫొటోలుగానీ, వీడియోలుగానీ చిత్రీకరిస్తే కఠినంగా శిక్షించేందుకు వీలుగా సైబర్ క్రైమ్ చట్టాన్ని యూఏఈ సవరించింది. సవరించిన చట్టం ప్రకారం యూఏఈలో ఇకపై ఎవరైనా ప్రమాద బాధితుల చిత్రాలు, వీడియోలు తీస్తే ఆరు నెలల జైలు లేదా రూ.31 లక్షల నుంచి రూ.కోటి వరకు జరిమానా.. ఒక్కోసారి రెండింటిని విధిస్తారు. రోడ్డు ప్రమాద బాధితుల గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు ఈ చట్టాన్ని తీసుకువచ్చామని యూఏఈ పేర్కొంది. ఈ చట్టం జనవరి 2, 2002 నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. సాక్ష్యాల సేకరణలో అధికారులకు మినహాయింపు ఉంటుందని వివరించింది. అంతేకాకుండా అనుమతి లేకుండా ఇతరుల ఫొటోలు, వీడియోలు తీయడం, ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి అప్రతిష్ఠ పాలు చేస్తే నేరంగా పరిగణిస్తూ చట్టాలను కఠినతరం చేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడితే కనీసం ఏడాది జైలు శిక్షతోపాటు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు జరిమానా విధించేవిధంగా చట్టాల్లో మార్పులు చేశారు.
ఇదీ చూడండి: రష్యాకు ఈయూ షాక్.. కార్పొరేట్ సంస్థలూ దూరం..