రెండు గంటల వ్యవధిలోనే సిరియాలోని రెండు వేర్వేరు చోట్ల కారు బాంబు దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో మొత్తం 12 మంది దుర్మరణం చెందారు.
సిరియా తిరుగుబాటు దారుల అధీనంలో ఉన్న అజాజ్ ప్రాంతంలో తొలి కారు బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అజాజ్‌కు 30 మైళ్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో జరిగిన మరో పేలుడులో ఆరుగురు ఫైటర్లు చనిపోయారు.
వాయవ్య సిరియాలో ఇటీవలి కాలంలో పేలుడు ఘటనలు పెరిగిపోతున్నాయి. జనవరి ప్రారంభం నుంచి పేలుళ్లు జరగడం ఇది 11వ సారి అని మీడియా వర్గాలు తెలిపాయి.
కుర్దిష్ బలగాల కాల్పుల్లో..
మరోవైపు.. ప్రభుత్వ అనుకూల నినాదాలు చేస్తున్న నిరసనకారులపై కుర్దిష్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఓ సిరియా పౌరుడు చనిపోయాడు. మరో నలుగురు గాయపడ్డారు.