Saudi Arabia Executions: హత్యలు, ఉగ్రవాదం వంటి నేరాలకు పాల్పడిన 81 మందికి (సౌదీలు 73 మంది, యెమన్లు ఏడుగురు, సిరియన్ ఒకరు) శనివారం సౌదీ అరేబియాలో సామూహికంగా మరణశిక్ష అమలు చేశారు. గల్ఫ్ రాజ్య ఆధునిక చరిత్రలో ఇదే అతిపెద్ద సామూహిక మరణశిక్షల అమలు చర్యగా చెప్పవచ్చు. 1979లో మక్కాలోని దివ్య మసీదును స్వాధీనం చేసుకున్నందుకు దోషులుగా తేలిన 63 మంది ఉగ్రవాదులకు 1980 జనవరిలో సామూహిక మరణశిక్ష అమలు చేశారు.
ఇస్లాం మతానికి చెందిన పవిత్ర ప్రదేశంపై జరిగిన ఘోరమైన దాడిగా ఉగ్రవాదుల చర్య గుర్తుండిపోయింది. తాజాగా అంతకంటే ఎక్కువ సంఖ్యలో సామూహిక మరణశిక్షలను అమలు చేయడం గమనార్హం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సౌదీ ప్రెస్ ఏజెన్సీ శనివారం తాజా మరణశిక్షల గురించి ప్రకటించింది. నిందితుల్లో కొందరు అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఉగ్రవాదులతోపాటు యెమన్‌లోని హౌతి తిరుగుబాటు దళాల మద్దతుదారులు ఉన్నట్లు వెల్లడించింది. మరణశిక్షలు ఎక్కడ.. ఎలా అమలు చేశారన్న వివరాలు తెలుపలేదు.
ఇదీ చూడండి: చైనాలో మరోసారి కొవిడ్ కలకలం.. రెండేళ్ల గరిష్ఠానికి కొత్త కేసులు