ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు ఇరాన్‌పై మండిపడ్డారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో తమ నౌక ప్రమాదానికి గురవడానికి కారణం ఇరాన్ అని ఆరోపించారు. నౌకపై దాడి చేయించింది ఆ దేశమేనని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్‌కు చెందిన ఎంవీ హెలియోస్ రే అనే కార్గో నౌకలో శుక్రవారం అనుమానాస్పద రీతిలో పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో బెంజమిన్ సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఇరాన్.. ఇజ్రాయెల్‌కు అతిపెద్ద శత్రువు. ఈ ప్రమాదానికి కారణం ఇరాన్ అని స్పష్టంగా తెలుస్తోంది. వారిపై అన్ని విధాలా ప్రతిఘటిస్తాము."
-బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని
పేలుడు కారణంగా నౌక కుడి, ఎడమ భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అందులోని బృందం సురక్షితంగా బయటపడింది. మరమ్మతుల కోసం నౌకను ఆదివారం దుబాయ్ పోర్టుకు తరలించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేపడుతున్నారు. సింగపూర్‌కు వెళ్తున్న ఈ నౌక.. వివిధ ప్రాంతాలకు కార్లను రవాణా చేస్తోందని సమాచారం.
వైమానిక దాడులు..
నౌక ఘటనకు ప్రతిఘటనగా ఇజ్రాయెల్ సిరియా సరిహద్దు వద్ద వైమానిక దాడులు జరిపింది. ఈ దాడిని సిరియా ఖండించగా.. ఆ ప్రాంతంలో ఉన్న ఇరాన్ స్థావరాలే లక్ష్యంగా ఈ దాడి జరిపారని అని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. నౌక ఘటనకు ప్రతి చర్యగా ఈ దాడులు చేపట్టినట్టు స్పష్టం చేసింది. అయితే ఇందుకు సంబంధించి ఇజ్రాయెల్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ ఆరోపణలపై మౌనం వహించింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉన్న వివాదల నేపథ్యంలో.. ఈ ఘటన పశ్చిమాసియాలోని జలమార్గాలలో భద్రతపై సందేహాలు వ్యక్తం అయ్యేలా చేస్తోంది.
ఇదీ చదవండి : ట్రక్కు, రెండు కార్లు ఢీ- 9 మంది మృతి