Latakia Port Attack: సిరియాలోని లటాకియా నౌకాశ్రయంపై ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు క్షిపణుల దాడి చేసినట్లు ఆ దేశం తెలిపింది. అయితే ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని స్పష్టంచేసింది. పోర్ట్‌లోని కంటైనర్ ప్రాంతంలో అనేక క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించిందని సిరియాకు చెందిన ఓ మిలిటరీ అధికారి.. స్థానిక మీడియాసంస్థకు వివరించారు. ఇదే విషయంపై పూర్తివివరాలను మాత్రం వెల్లడించలేదు.
లటాకియా పోర్ట్‌పై ఇది ఒక అరుదైన దాడిగా అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఈ నౌకాశ్రయం నుంచే సిరియా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులు దేశవ్యాప్తంగా సరఫరా అవుతాయి. లటాకియా పోర్ట్‌లో మొత్తం ఐదు పేలుళ్లు జరిగినట్లు సిరియాలోని టీవీ తెలిపింది. కంటైనర్లు ఉన్నప్రాంతంలో పెద్దఎత్తున మంటలు చెలరేగినట్లు పేర్కొంది. అయితే ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పందించలేదు.
Syria Israel War: గతకొన్నేళ్లుగా సిరియా, ఇజ్రాయెల్ మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వందలసార్లు ఇజ్రాయెల్ క్షిపణిలు.. సిరియాపై దాడులు చేశాయి. సిరియా రాజధాని డమాస్కస్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగానూ గతంలో దాడులు జరిగాయి. అయితే సిరియాలో ఉన్న ఇరాన్ ఫైటర్స్పైనే తాము దాడులు జరిపామని ఇజ్రాయెల్ వెల్లడిస్తూ వస్తోంది.
ఇదీ చూడండి: కరోనా రూల్స్ బ్రేక్ చేసినందుకు ఆంగ్‌సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష