ఇరాన్‌కు సైనిక అణు శాస్త్రవేత్త మొసిన్ ఫక్రజాదే హత్యకు తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీ పేర్కొన్నారు. ఆయన హత్యకు ఇజ్రాయెలే కారణమని ఉద్ఘాటించారు. కరోనా టాక్స్ఫోర్స్కు సంబంధించిన ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న రౌహానీ.. ఫక్రజాదే మరణించినప్పటికీ దేశంలోని అణు కార్యక్రమాలు ఆగబోవని స్పష్టం చేశారు.
"అమరవీరుడు ఫక్రజాదే హత్యపై సరైన సమయంలో స్పందిస్తాం. ఇరాన్ తెలివైన దేశం. జియోనిస్టు(ఇజ్రాయెల్ మద్దతుదారు)ల ఉచ్చులో చిక్కుకోదు. గందరగోళం సృష్టించాలని వారు భావిస్తున్నారు."
-హసన్ రౌహానీ, ఇరాన్ అధ్యక్షుడు
అబ్సర్డ్ అనే గ్రామంలో ఫక్రజాదేపై దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కు ఆయన ప్రయాణిస్తున్న కారు సమీపంలో పేలిందని అక్కడి మీడియా తెలిపింది. కారు ఆగిన తర్వాత ఐదుగురు సాయుధులు కాల్పులకు పాల్పడ్డారని వెల్లడించింది. ఈ ఘటనలో గాయపడ్డ ఫక్రజాదే ఆస్పత్రిలో మరణించారని స్పష్టం చేసింది.
దశాబ్దం క్రితం అనేక మంది ఇరాన్ అణు శాస్త్రవేత్తలను హత్య చేశారని ఇజ్రాయెల్‌పై ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజా హత్యపై మాత్రం ఇజ్రాయెల్ ఎలాంటి స్పందన తెలియజేయలేదు.