కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచం విలవిలలాడుతోంది. కరోనా కేంద్రబిందువు చైనా తర్వాత అత్యధిక మరణాలు ఇరాన్‌లోనే సంభవించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ సలహామండలి సభ్యుడు మహమ్మద్ మిర్ మోహమ్మది మరణంతో మృతుల సంఖ్య 66కు చేరింది. వైరస్ ప్రభావంతో ఒక ఉన్నత స్థాయి వ్యక్తి మరణించటం ఇదే తొలిసారి. 1,501 మంది వైరస్ బారిన పడ్డారు.
ఐరోపా సమాఖ్యలో హైఅలర్ట్
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో హైఅలర్ట్ ప్రకటించింది ఐరోపా సమాఖ్య వ్యాధుల నియంత్రణ విభాగం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కొరియాలో ఆస్పత్రులు ఫుల్..
దక్షిణ కోరియాలో కరోనా సోకిన వారితో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆస్పత్రులతో పాటు అన్ని రకాల వైద్య కేంద్రాలు రోగులతో నిండిపోయాయి. కొత్తగా 476 మందికి వైరస్ లక్షణాలు గుర్తించారు. మొత్తంగా 4,212 మంది వైరస్ బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలో ఇద్దరు మృతి..
అగ్రరాజ్యం అమెరికాలో ఆదివారం ఒక్కరోజే కరోనాతో ఇద్దరు మృతి చెందారు. 80 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో జపాన్ క్రూయిజ్ షిప్ నుంచి తరలించిన వారితో పాటు వుహాన్ నుంచి వచ్చిన వారు ఉన్నారు.
ఇండోనేషియాలో తొలి కేసు..
ఇండోనేషియాలో కరోనా తొలి కేసు నమోదైంది. విదేశీ పర్యటకునితో కలిసిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి ఈ వైరస్ లక్షణాలను గుర్తించారు.
చైనాలో తగ్గిన కాలుష్యం..
వైరస్‌కు ప్రధాన కేంద్ర బిందువైన చైనాలో ఇప్పటి వరకు 2912 మంది మరణించగా 80 వేల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. కరోనాకు ప్రధాన కేంద్ర బిందువైన చైనాలో వాతావరణ కాలుష్యం గణనీయంగా తగ్గినట్లు నాసా ప్రకటించింది. నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థలకు చెందిన కాలుష్య పర్యవేక్షణ ఉపగ్రహాలు తీసిన పలు చిత్రాలను విడుదల చేసింది. కరోనా వైరస్ ప్రభావంతో వాహనాలు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు, పరిశ్రమల నుంచి విడుదలయ్యే నైట్రోజన్ డైఆక్సైడ్, విష వాయువులు తగ్గిపోయినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి: వుహాన్‌కు 4వేల మంది సైనిక వైద్య సిబ్బంది