అది 2014 నవంబర్ రెండో వారం.. ఉత్తర అమెరికా యూదుల ఫెడరేషన్ సదస్సు జరుగుతోంది. నాటి ఉపాధ్యక్షుడు జోబైడెన్ మాట్లాడుతూ.."మీరు బీబీకి చెప్పండి. ఇప్పటికీ తను నా బెస్ట్‌ఫ్రెండ్. ఆయన నాకు దాదాపు 30 ఏళ్ల నుంచి మిత్రుడు. నాకు బీబీకి అభిప్రాయభేదాలు ఉండొచ్చు.. కానీ, ఐ లవ్ యూ" అని ప్రేక్షకుల్లో కూర్చొన్న ఇజ్రాయెల్ రాయబారికి చెప్పారు. బైడెన్ పేర్కొన్న ఆ బీబీ ఎవరో కాదు.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు.! బీబీ ఆయన ముద్దుపేరు. వాస్తవానికి నెతన్యాహు దూకుడు.. నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ఇష్టం ఉండేది కాదు. అగ్రరాజ్య అధ్యక్షుడి కార్యవర్గం అప్పట్లో నెతన్యాహుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దానికి జో పై విధంగా వివరణ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో చాలా మంది 2021లో బైడెన్ అధికారంలోకి రాగానే నెతన్యాహును పక్కన పెట్టేశారని ప్రచారం చేశారు. కానీ, తాజాగా ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణ సమయంలో వారిద్దరి మధ్య ఎంత సమన్వయం ఉందో బయటకు తెలిసింది. 'ఈ రోజు కాల్పుల విరమణ ప్రకటన ఉంటుందని నేను ఆశిస్తున్నాను' అని బైడెన్ ఈ నెల 19న.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు చెప్పిన 24 గంటల్లో కాల్పుల విరమణ ప్రకటన వెలువడటం విశేషం.
ఇదీ చదవండి: గాజాపై కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఆమోదం
ఇదీ చదవండి: ఇజ్రాయెల్ కాల్పుల విరమణపై ప్రపంచ నేతల హర్షం
మిత్రుడిని ఇబ్బంది పడనీయలేదు..
ఈ మొత్తం వ్యవహారంలో జో బైడెన్ తన విదేశాంగ నీతి చతురతను చూపించారు. ఆయన బహిరంగంగా ఎక్కడా తన ఆత్మీయ దేశమైన ఇజ్రాయెల్‌ను విమర్శించలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్‌లో బెంజిమన్ నెతన్యాహు దూకుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన అలానే ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు. ఇప్పుడు బైడెన్ బహిరంగంగా ఒత్తిడి తెస్తే దేశీయంగా ఆయన రాజకీయ ప్రతిష్ఠకు దెబ్బ. ఆయన మాట వినకపోవచ్చు కూడా. అందుకే కేవలం వ్యక్తిగత ఫోన్‌కాల్స్‌తో మంతనాలు చేశారు. ఈ వివాదం మొదలైనప్పటి నుంచి దాదాపు నాలుగుసార్లకు పైగానే ఇజ్రాయెల్ ప్రధానితో బైడెన్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ క్రమంలో కూడా నెతన్యాహు వెనక్కి తగ్గేందుకు అంగీకరించలేదు. ఈ నెల 19న జరిగిన సంభాషణలో ఆ రోజు కాల్పుల విరమణ ఆశిస్తున్నట్లు చెప్పారని శ్వేతసౌధం పేర్కొంది.
ఓ పక్క.. బైడెన్ ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కుందని పదేపదే ప్రకటిస్తుండటంతో.. సొంత పార్టీ నుంచే ఒత్తిడి పెరిగిపోయింది. మిషిగాన్ ప్రతినిధి రషీద తలైబ్, సెనెటర్ క్రిస్ వాన్ హోలెన్, బర్నిశాండర్స్ వంటి వారు బహిరంగానే ఇజ్రాయెల్‌ను విమర్శించారు. ఇజ్రాయెల్‌కు ఆయుధ విక్రయాలను ఆపేయాలని కోరారు. అయినా.. జో చాలా వరకు నెతన్యాహును బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఐరాసలో భద్రతా మండలిలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా వచ్చిన తీర్మానాలను అమెరికా అడ్డుకొంది. మరోవైపు.. ఫ్రాన్స్ వంటి దేశాలు ఐరాసలో కాల్పుల విరమణ తీర్మానాలపై పనిచేస్తున్నాయి. దీంతో అంతర్జాతీయ సమాజం, అమెరికా ఒత్తిడితో ఇజ్రాయెల్ దిగి వచ్చింది. బైడెన్ ఇబ్బందులు, పరిధి నెతన్యాహుకు బాగా తెలుసు. 24 గంటల్లో కాల్పుల విరమణ ప్రకటన వెలువడింది.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్ దాడుల్లో 6 నెలల మృత్యుంజయుడు!
నిశ్శబ్ద రాయబారిగా ఈజిప్టు.!
మరోపక్క.. పాకిస్థాన్, టర్కీ ఈ వివాదం నుంచి లబ్ధిపొందడానికి హమాస్‌ను ఎగదోస్తుండగా.. మరోపక్క యూఏఈ, సౌదీ ప్రకటనలకే పరిమితం అయ్యాయి. అప్పుడు ఈజిప్టు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించింది. ఇజ్రాయెల్-ఈజిప్టు బంధం చాలా ప్రత్యేకమైంది. క్యాంప్ డేవిడ్ ఒప్పందంతో ఇజ్రాయెల్‌ను గుర్తించిన తొలి అరబ్ దేశం ఈజిప్టు. అరబ్ దేశాల గ్రూప్ మాటను పక్కనబెట్టి ఈ శాంతి ఒప్పందం చేసుకొంది. గాజా పట్టీతో ఈజిప్టు సరిహద్దులు పంచుకొంటుంది. గాజా మూడు వైపులా ఇజ్రాయెల్ ఉంటే ఒక వైపు మధ్యదరా సముద్రం, మరోవైపు ఈజిప్ట్ ఉంటాయి. ఈజిప్ట్ సహకారంతోనే ఇజ్రాయెల్ గాజాపట్టీలోకి ఆయుధాలు, పేలుడు పదార్థాలు రాకుండా చూస్తుంది. 2006లో రహస్య సొరంగం సాయంతో హమాస్ కిడ్నాప్ చేసిన గిలాద్ హమీద్ అనే సైనికుడిని కూడా ఐదేళ్ల తర్వాత ఈజిప్టు చర్చలు జరిపి విడిపించిన చరిత్ర ఉంది.
ఇక గాజాపట్టీని పాలిస్తున్న హమాస్‌తో కూడా ఈజప్ట్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణ మొదలైన కొన్ని గంటల్లో ఇరు వర్గాలు శాంతించాలని ఈజిప్ట్ కోరింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సమావేశంలో కూడా టర్కీ,పాక్ వలే ఇజ్రాయెల్‌ను బెదిరిస్తూ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇరుపక్షాలు చర్చలు జరిపి శాంతిని స్థాపించాలని కోరింది. ఆ తర్వాత హమాస్‌తో మాట్లాడేందుకు ఓ బృందాన్ని గాజాపట్టీ పంపి హమాస్‌తో చర్చలు జరిపింది. దాని షరతులు తెలుసుకొని ఇజ్రాయెల్ వద్దకు వెళ్లింది. కానీ, ఇజ్రాయెల్ నిరాకరించింది. మరోపక్క పాలస్తీనా క్షతగాత్రులు, శరణార్థులకు ఈజిప్టు ఆశ్రయం ఇచ్చింది. ఓ పక్క ఇరు పక్షాలతో చర్చలు జరుపుతూనే అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెంచే ప్రయత్నంచేశారు. ఈజిప్టు అధ్యక్షుడు అల్‌సిసి ..ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌ను సాయం కోరారు. దీంతో ఫ్రాన్స్ ఐరాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఇజ్రాయెల్‌ను కాపాడేందుకు దానిని అమెరికా వ్యతిరేకించింది. కానీ, అగ్రరాజ్యంపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా బైడెన్ కూడా నెతన్యాహుపై ఒత్తిడి పెంచి కాల్పుల విరమణ ప్రకటన చేయించారు.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి రాజకీయ కోణం
షరతులు ఉన్నాయి.. అబ్బే లేవు..
తాజాగా ప్రకటించిన కాల్పుల విరమణలో గందరగోళం కొనసాగుతోంది. ఎటువంటి షరతులు లేకుండా కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతోపాటు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధిపతి మిర్‌బెన్ ఈజిప్ట్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. ఇక్కడి చర్చల పురోగతిని ఈజిప్ట్ అధ్యక్షుడు సిసి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఫోన్‌కాల్‌లో వివరించారు. ఈ సందర్భంగా బైడెన్ ఈజిప్ట్ చొరవను అభినందించారు.
ఇక హమాస్ సీనియర్ నాయకుడు ఒసామ హమ్‌దాన్ ఓ విదేశీ వార్త సంస్థతో మాట్లాడుతూ.. షేక్ జర్రా, అల్-అక్సా మసీదుపై తమకు హామీ వచ్చిందని పేర్కొన్నట్లు ఇజ్రాయెల్ మీడియా కంపెనీ వాలా పేర్కొంది. దీనిని ఇజ్రాయెల్ అధికారులు ఖండించారు. ఎటువంటి షరతులు లేవని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'ఇజ్రాయెల్-గాజా' కాల్పుల విరమణకు బైడెన్ మద్దతు