కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చట్టసభ్యుల నుంచి తమకు సరిపడా మద్దతు ఉందని ప్రకటించారు ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేత, సెంట్రిస్ట్ యెష్ అటిడ్ పార్టీకి చెందిన యాయిర్ లాపిడ్. ఈ విషయాన్ని అధ్యక్షుడు రివ్లిన్కు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇచ్చిన గడువు మరో అరగంటలో ముగుస్తుందనగా లాపిడ్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. తమకు యేష్ అతిద్, కహోల్ లావన్, ఇజ్రాయెల్ బైటెన్యూ, లేబర్, యామినా, న్యూహోప్, మేరెట్జ్, రామ్ పార్టీల మద్దతు ఉందని లాపిడ్.. అధ్యక్షుడికి వెల్లడించారు.
యామినా పార్టీ నేత నాఫ్తాలీ బెన్నెట్ ప్రధానిగా ముందు బాధ్యతలు చేపడతారని లాపిడ్.. అధ్యక్షుడికి స్పష్టం చేశారు. చెరో రెండేళ్లు అధికారం పంచుకునే విధంగా ఇరువురూ ఒప్పందం కుదుర్చుకున్నారు.
లాపిడ్ ప్రకటనపై అధ్యక్షుడు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తున్నందుకు లాపిడ్ సహా మద్దతుగా నిలిచిన పార్టీలకు అభినందనలు తెలిపారు.
ప్రభుత్వ ఏర్పాటుపై స్పీకర్‌కు కూడా లాపిడ్ సమాచారం అందించారు. వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటుపై పార్లమెంటు సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 120 సీట్లున్న ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. 61మంది సభ్యుల మద్దతు అవసరం.
ఇదీ చదవండి : 12 ఏళ్ల తర్వాత గద్దె దిగనున్న నెతన్యాహు!