దాడులతో గత కొన్ని రోజులుగా అట్టుడుకుతున్న గాజాలో శాంతి స్థాపనపై ఆశలు చిగురిస్తున్నాయి. యుద్ధం అంచున ఉన్న పాలస్తీనా- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేపట్టిన చర్చలు ఫలితాల్ని ఇస్తున్నట్టు తెలుస్తోంది. మరో 24 గంటల్లో కాల్పుల విరమణపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందని చర్చలతో సంబంధం ఉన్న అధికారులు పేర్కొన్నారు.
రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు మొదలైనప్పటి నుంచి వాటి మధ్య సయోధ్యకు ఈజిప్ట్ తీవ్రంగా కృషి చేస్తోంది. కానీ ఇన్ని రోజులు అవి ఫలితాల్ని ఇవ్వలేదు. అయితే కాల్పుల విరమణ గురించి ఇజ్రాయెల్‌పై అమెరికా కూడా ఒత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే.. 24 గంటల్లో ఓ స్పష్టత వచ్చే అవకాశముందని ఈజిప్ట్‌కు చెందిన ఓ నిఘా అధికారి పేర్కొన్నారు.
మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, మరికొద్ది గంటల్లో తన భద్రతా మండలితో సమావేశంకానున్నారు. కాల్పుల విరమణపై ఇందులో చర్చించే అవకాశముంది. ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలకు ఈ వార్త ఊతమందిస్తోంది.
పాలస్తీనా నిరసనకారులు, ఇజ్రాయెల్ పోలీసులు మధ్య ఇటీవలే చెలరేగిన ఘర్షణలు రెండు దేశాలను యుద్ధం అంచుకు నెట్టాయి. అప్పటి నుంచి ఇజ్రాయెల్ మిలిటరీ- హమాస్ ఉగ్రవాదులు ఒకరిపై ఒకరు రాకెట్ దాడులతో విరుచుకుపడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 227మంది పాలస్తీనావాసులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 64మంది చిన్నారులు, 38మంది మహిళలు ఉన్నారు. 1,620మందికిపైగా మంది క్షతగాత్రులయ్యారు. 20మంది హమాస్, ఇస్లామిక్ జిహాద్ సభ్యులు మరణించారు. మొత్తం మీద 58వేల మంది ఇళ్లను విడిచి వసలవెళ్లిపోయారు. ఈ పరిణామాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం లభిస్తే.. గాజా ప్రజలు ఊపిరిపీల్చుకున్నట్టు అవుతుంది.
ఇదీ చూడండి:- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి రాజకీయ కోణం