టర్కీ, గ్రీస్ దేశాలను భారీ భూకంపం కుదిపేసింది. ఏజియన్ సముద్రంలో సంభవించిన భూప్రకంపనల కారణంగా సునామీ సంభవించింది. ముఖ్యంగా టర్కీలోని ప్రధాన నగరాల్లో ఒకటైన ఇజ్మిర్ పట్టణంలో పలు భవనాలు కుప్పకూలి 12 మంది మరణించారు. దాదాపు 400 మంది క్షతగాత్రులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
38 అంబులెన్సులు, రెండు హెలికాప్టర్ అంబులెన్సులు, 35 వైద్య బృందాలతో సహాయక చర్యలు చేపట్టినట్లు టర్కీ ఆరోగ్యమంత్రి తెలిపారు. ఇప్పటివరకు శిథిలాల నుంచి 70 మందిని రక్షించాయి సహాయక బృందాలు. భూకంపం కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. చిన్నపాటి సునామీతో సముద్రపు నీరు వీధుల్లోకి రావడం కనిపించింది. కొన్ని చోట్ల భవనాలు కుప్పకూలగా.. వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఇస్తాంబుల్‌లో స్వల్పంగా..
టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోనూ భూమి కంపించింది. ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదని ఇస్తాంబుల్ గవర్నర్ పేర్కొన్నారు.
ఏజియన్ సముద్రంలో 13 కిలోమీటర్ల లోతులో.. రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ఈ భూంకంపం వచ్చినట్లు అమెరికా జియోలాజిక్ సర్వే పేర్కొంది.
గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. గ్రీస్‌కు చెందిన ద్వీపం సామోస్‌లోనూ భూమి కంపించడం వల్ల ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.