ఉక్రెయిన్ విమానం ప్రమాదం విషయంలో దిద్దుకోలేని తప్పు చేశామన్నారు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ. తమ సైన్యం క్షిపణిని ప్రయోగించడంలో జరిగిన పొరపాటు వల్ల దురదృష్టవశాత్తు విమానం కూలి 176 మంది దుర్మరణం చెందారని వివరణ ఇచ్చారు. దీనిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి ఏమన్నారంటే..
ఇరాన్ విదేశాంగ మంత్రి జావద్ జరీఫ్ కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించారు. ‘'అదో బాధాకరమైన రోజు.. అమెరికా వల్ల తలెత్తిన వివాదం నేపథ్యంలో ఈ తప్పు జరిగిందని సైనిక బలగాల అంతర్గత దర్యాప్తులో తేలింది. దీనికి మేం ఎంతో పశ్చాత్తాపపడుతున్నాం. విమాన ప్రమాదంలో చనిపోయిన ఇరాన్, ఇతర దేశాల మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెబుతున్నాం’' అని జావద్ ట్వీట్ చేశారు.