ఒకరిపై ఒకరు ఎంతో ఉత్సాహంగా నీళ్లు జల్లుకుంటున్న ఈ ప్రాంతం... చైనాలోని యున్నమ్ రాష్ట్రానికి చెందినది. ఇక్కడి దాయ్ జాతికి చెందిన వారు నీళ్లు జల్లుకుని నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ పండుగ పేరు సాంగ్క్రన్. ఇలా ఒకరిపై ఒకరు నీళ్లు జల్లుకుంటే శుభం జరుగుతుందని, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని వారి నమ్మకం.
ఈ ఉత్సవాన్ని చైనావాసులు ఎంతో ఆహ్లాదంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన జానపద గేయాలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇక్కడి పోలీసులపైనా నీళ్లు జల్లి వారికి అంతా మంచి జరగాలని శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఉత్సవంలో భాగంగా రాత్రివేళ ఆకాశంలోకి లాంతర్లను వదిలారు. వీటికి కోంగ్మింగ్ లాంతర్ అని పేరు. నిశీధిలో ఉషోదయంలా లాంతర్ల వల్ల చీకటి ఆకాశమూ కాంతులతో మెరిసిపోయింది. స్థానికులతో పాటు పర్యటకులూ ఈ వేడుకలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
"మేము తొలిసారి ఈ పండుగలో పాల్గొన్నాం. ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఎన్నో లాంతర్లు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు చూడడం సంతోషకరంగా ఉంది"
---- క్సూ, పర్యటకురాలు
థాయ్వాసుల నూతన సంవత్సర వేడుకలు ఈ నెల 12 నుంచి 17 వరకు జరుగుతాయి.