దేశంలో ప్రవాసీల సంఖ్యను తగ్గించుకోవడంలో భాగంగా తీసుకొచ్చిన ‘ప్రవాసీ కోటా’ ముసాయిదా బిల్లుకు కువైట్ జాతీయ శాసనసభ కమిటీ ఆమోదం తెలిపింది. కరోనా మహహ్మరి ప్రభావంతో చమురు ధరలు తగ్గిపోవడంతో కువైట్ ప్రభుత్వం ప్రవాసీ జనాభాను దాదాపు 30శాతానికి తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఈ బిల్లును రూపొందించింది. ఈ బిల్లు చట్టబద్ద ప్రక్రియ పూర్తయితే మాత్రం అక్కడ నివసిస్తున్న దాదాపు 8లక్షల మంది భారతీయులు స్వదేశానికి తిరిగి రావాల్సి వస్తుంది.
'భారతీయులు 15 శాతానికి మించకూడదు'
కువైట్లో కరోనావైరస్ విజృంభణతో విదేశీయులను వెనక్కి పంపించాలనే డిమాండ్ స్థానిక అధికారులు, నాయకుల నుంచి ఎక్కువైంది. దీంతో ప్రస్తుతం 70శాతంగా ఉన్న ప్రవాసీలను 30శాతానికి తగ్గించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లును కువైట్ ప్రధానమంత్రి షేక్ సబా అల్- ఖలీద్ అల్- సబా ప్రతిపాదించినట్లు కువైట్ స్థానిక మీడియా వెల్లడించింది. ఈ బిల్లు ప్రకారం, అక్కడి జనాభాలో భారతీయుల సంఖ్య 15శాతం మించకూడదు.
కమిటీ పరిశీలనలో బిల్లు
దాదాపు 43లక్షల జానాభా ఉన్న కువైట్‌లో వివిధ దేశాల ప్రవాసీల సంఖ్య 30లక్షలు కాగా వీరిలో అత్యధికంగా భారత్ నుంచే 14లక్షల మంది ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం కువైట్ ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లుతో అక్కడ నివసిస్తున్న దాదాపు 8లక్షల మంది భారతీయులు తిరిగి రావాల్సి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కువైట్ జాతీయ శాసనసభ కమిటీ ఈ ముసాయిదా బిల్లును తదుపరి ప్రణాళిక, మార్గదర్శకాలను రూపొందించడం కోసం మరో కమిటీకి బదిలీ చేసింది. ఇప్పటివరకు కువైట్‌లో 49,000 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: చైనాలో మరో మహమ్మరి కలకలం!