యెమెన్‌లో జరిగిన తొక్కిసలాటలో 78 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో మంది గాయపడ్డారు. సనాలోని ఓల్డ్ సీటీలో వ్యాపారులు ఏర్పాటు చేసిన ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమంలో వందలాది మంది పేదలు గూమిగూడడం వల్ల తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. స్థానిక అధికారులతో సమన్వయం లేకుండా నిధులను యాదృచ్ఛికంగా పంపిణీ చేయడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలు రాగా... వారిని నియంత్రించే ప్రయత్నంలో సాయుధ హౌతీలు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు పరుగులు తీయడం వల్లే తొక్కిసలాట జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామన్న అధికారులు... పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
సాయుధులు కాల్పులు జరిపిన క్రమంలో.. ఓ ఎలక్ట్రిక్ వైర్లకు బుల్లెట్లు తగిలి మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ పేలడం వల్ల ప్రజలు భయాందోళనకు గురైనట్లు ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు అబ్దెల్ రెహ్మాన్ అహ్మద్, యహీనా మోసెన్ తెలిపారు. అందరూ పరుగులు పెట్టడం వల్ల తొక్కిసలాట జరిగిందని చెప్పారు. మహిళలు, చిన్నారులు సైతం జనంలో ఉన్నారని తెలిపారు. ఘటనాస్థలిలో ఉన్నవారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డజన్ల కొద్దీ మృతదేహాలు సహా.. సాయం కోసం క్షతగాత్రులు అరుస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. బాధితుల దుస్తులు, పాదరక్షలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
స్థానిక అధికారులకు వ్యాపారులు సమాచారం ఇవ్వకుండా పంపిణీ చేయడం వల్లే ఘటన జరిగిందని యెమెన్ హోంశాఖ మంత్రి బ్రిగేడియర్ అబ్దెల్ ఖాలెక్ అల్ అఘ్రి తెలిపారు. ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశామని చెప్పారు. ఘటనపై పూర్తి దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 2వేల డాలర్ల (రూ.లక్షా 60 వేలు) పరిహారం ప్రకటిస్తున్నట్లు హౌతీలు తెలిపారు. క్షతగాత్రులకు 400 డాలర్లు (రూ.32వేలు) అందించనున్నట్లు వెల్లడించారు.
దీంతో ఇది, సౌదీ, ఇరాన్ల మధ్య పరోక్ష యుద్ధం మొదలైంది. ఇప్పటివరకు ఈ యుద్ధంలో లక్షా యాభై వేల మందికి పైగా మరణించారు. సైనికులతో పాటు సాధారణ పౌరులు సైతం ఈ యుద్ధానికి బలయ్యారు. ఈ మారణకాండ యెమెన్‌లో తీవ్రమైన మానవతా సంక్షోభానికి దారితీసింది. ఆ దేశంలోని మూడింట రెండొంతుల మంది ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి అంచనా. 2.1 కోట్ల మందికి సహాయం అవసరమని ఐరాస పేర్కొంది.